చిరోటి /స్వీట్ పూరీ/పదర్ పేణి(Chiroti/Sweet Poori/Padar Peni)

కావలసిన పదార్థాలు :

మైదా--1 కప్
చెక్కర--1 కప్
నెయ్యి--4 టేబుల్ స్పూన్స్
బియ్యప్పిండి--2 టేబుల్ స్పూన్స్
ఉప్పు--చిటికెడు
నూనె--3 కప్స్(వేయించడానికి)
నీరు--పిండి కలపడానికి

విధానము:

1.ఒక గిన్నె లో మైదా వేసుకోవాలి.


2.అందులోకి చిటికెడు ఉప్పు వేయాలి.


3.తరువాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి.


4.తరువాత పిండిని బాగా కలిపి కొద్ది కొద్దిగా నీరు పోసి, పూరీ పిండిలా కలపాలి.


5.తరువాత కలిపిన పిండిని మూత పెట్టి, 30 నిముషాలు నాననివ్వాలి.


6.పిండి నానడం వల్ల మృదువుగా మెత్తగా అవుతుంది.


7.తరువాత నానిన పిండిని 5 సమ భాగాలుగా ఉంటలు చేసుకోవాలి.


8.తరువాత చపాతి పీటపై ఒక్కో ఉంటను పెట్టి చపాతీలా చేసుకోవాలి.


9.అన్ని ఉంటలను చపాతీలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.


10.తరువాత ఒక చిన్న గిన్నె లో 2 స్పూన్స్ బియ్యప్పిండి+2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.


11.తరువాత ఒక చపాతి తీసుకొని దానిపై బియ్యప్పిండి మిశ్రమాన్ని పూయాలి.


12.తరువాత మరొక చపాతి తీసుకొని, మొదటి చపాతికి కొద్దిగా కింద పెట్టి దానికి కూడా బియ్యప్పిండి మిశ్రమాన్ని పూయాలి.


13.ఇలా అన్నీ చపాతీలు ఒకదాని కింద ఒకటి పెట్టి, ప్రతీ చపాతీకి బియ్యప్పిండి మిశ్రమాన్ని పూయాలి.


14.తరువాత వాటిపై 1/2 స్పూన్ మైదా పిండి చిలకరించాలి.


15.తరువాత మిశ్రమాన్ని పూసిన చపాతీలను చివరి నుంచి చాపలా గుండ్రంగా చుట్టాలి.


16.ఇలా చుట్టిన పిండిని చపాతి పీటపై పెట్టుకోవాలి.


17.తరువాత పిండిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.18.కట్ చేసిన ముక్కలను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.


19.తరువాత ఒక్కొక్క ముక్కను పూరీలా వత్తుకోవాలి.


20.అన్నీ ముక్కలను పూరీలా వత్తుకొని పక్కన పెట్టుకోవాలి.


21.తరువాత ఒక గిన్నెలో 1 కప్ చెక్కర వేసి,2 కప్స్ నీరు వేసి బాగా మర్లించాలి.


22.తరువాత చెక్కర బాగా బుడగలు బుడగలుగా వస్తుంటే అప్పుడు పాకం వస్తోంది అని అర్థం.


23.తరువాత బుడగలు కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. లేకపోతే ముదురు పాకం వస్తుంది.( స్వీట్ పూరీలకు తీగ పాకం చేసుకోవాలి)


24.మీరు ఇప్పుడు పాకం స్పూన్/గరిట తో చూస్తే తీగలా వస్తుంది.


25.ఇలా తయారు చేసుకున్న పాకం పక్కన పెట్టుకోవాలి. పాకం గట్టి పడకుండా చిటికెడు నిమ్మకాయ రసం/1 స్పూన్ నూనె గాని వేసుకోవాలి. (నిమ్మకాయ రసం ఎక్కువ పిండితే పాకం పుల్లగా అవుతుంది)

26.తరువాత నూనె వేడికి పెట్టి, వేడి అయ్యాక తయారు చేసుకున్న పూరీలను వేసి, రెండు వైపులా వేయించాలి.


27.ఇలా వేయించిన పూరీలను తయారు చేసుకున్న పాకం లో వేసి 1 నిముషం ఉంచి తీసేయాలి.(ఎక్కువ సేపు నాన అవసరం లేదు)


28.అన్నీ పూరీలను దోరగా వేయించి పాకం లో ముంచి ప్లేట్ లో పెట్టుకోవాలి.


29. పాకంలో వేయడం ఇష్టం లేని వారు పూరీలను వేయించి, దాని పై చెక్కర కూడ వేసుకోవచ్చు.(వేడి పూరీలపై చెక్కర వేస్తే చెక్కర ఊడిపోకుండా ఉంటుంది)


అంతే ఎంతో రుచిగా ఉండే చిరోటి/స్వీట్ పూరీ/పదర్ పేణి రెడి.

ఈ పూరీలు, చెక్కర వేసిన/పాకం లో వేసిన ఏ విధంగా చేసిన చాలా బాగుంటాయి.


No comments:

Post a Comment